Thursday, December 16, 2010

నీ ముద్దు!!


నిన్నే చదివాను, "ప్రపంచానికి నువ్వు ఒక మనిషివే కావచ్చు, కాని ఒక మనిషికి నువ్వే ప్రపంచానివి" అని. ఆలొచిస్తూ ఉండిపొయాను. ఇంత కాంప్లెక్సిటీ లేకపోతే, జీవితం తో పాటు మనమూ పరిగెత్తాల్సిన అవసరమే లేకపోతే, నువ్వు తప్ప ఇంకే బరువు, భాధ్యత, కమిట్మెంట్స్ ... ఇవేమీ లేకపోతే ఎలా ఉండేదో అని.

అప్పటికీ ఎంత ప్రయత్నించినా నీకు దూరంగా వెళ్ళలేను.
అర్ధరాత్రి కిటికీ సందుల్లోనుండి వెన్నెల పలకరిస్తుంటే నువ్వు కావాలనిపిస్తుంది.
ఇంటి ముందు వర్షం నీరు నిన్ను గుర్తుకుతెస్తుంది.
సాయంత్రం గాలి నీ మాటై పలకరిస్తుంది.
ఇంతకీ నువ్వే నా ప్రపంచమా? తెలీదు.
కానీ నువ్వు లేకపొతే ఇది నా ప్రపంచం అయ్యేది కాదు. అది మాత్రం కచ్చితంగా చెప్పగలను.

చిన్ని నవ్వు.
కళ్ళ నుండి మొదలై పెదవి చివర తేలే నవ్వు.
అంతు లేని సంతృప్తి, ఆ కళ్ళు చూస్తే నాకు.
గుండెల నిండా గాలి పీల్చినంత నిండుగా .. సంపూర్ణంగా ఉంటుంది నీ కౌగిలింత.
నీలాకాశపు తీరాల్లోనో, ప్రపంచపు ఆవలి గ్రహాల్లోనో ఉంటుందేమో స్వర్గం అనుకునేదాన్ని.
నువ్వు నన్ను చేతుల్లోకి తీసుకున్నాకే తెలిసింది, అంత దూరం వెతకడం అనవసరమని.
నేను నీలో కలిసిపోయినట్టే ఉంటుంది, నీ పెదవుల తడి నన్ను అంటిన క్షణం.
జీవాన్ని కలిపేసినట్టు ఉంటుంది నీతో .. నన్ను ముద్దు పెట్టుకున్న నీ వైనం.

మొదటిసారి నీ ముద్దు ... తుఫానువనుకున్నను.
అంత ఆత్రం, ఆవేశం, పిచ్చి, నరాలు తెగిపొతాయేమో అనేంత ఉద్విగ్నత .... కొట్టుకుపొయాను నీ ప్రవాహంలో.
అంత దగ్గరితనం, అంత  తీవ్రత ... నా సమస్తాన్ని ఒక్క క్షణం లో కుదిపేసావు.
తలుచుకుంటే అనిపిస్తుంది, ఒక్క ముద్దు తో ఎన్ని ప్రకంపనాలు సృష్టించావు అని.

అందుకే అర్ధం కాదు నాకు నీ తలపు దేనిని పొలివుంటుందో అని ...
సాయంత్రపు చల్లగాలినా, సముద్రంలోని బడబాగ్నినా అని నాలొ నేనే వాదులాడుకుంటాను.
ఎముకలు విరిగే కౌగిలి నీదే, మళ్ళీ చెప్పాను కదా, పసిపాపను హత్తుకునే మెత్తదనం కూడా నీ చేతులదే.

అందుకే సాష్టాంగ నమస్కారం చేస్తాను ఆ ప్రేమకి.
నిన్ను దగ్గర చెసిన గుండె చప్పుళ్ళకి.
నాకీ అనుభవాన్నిచ్చిన నీ పెదవులకి.
నన్ను పరిపూర్ణం చేసిన నీ కౌగిలికి.
మన ఇద్దరిని కలిపిన సమయానికి.

... నాకు ప్రాణాన్నిచ్చిన విధాతకి.

No comments:

Post a Comment