Monday, December 27, 2010

ఎందుకు?

నువ్వు లేకుండా ఎలా గడపాలా జీవితం అంతా అనుకుంటాను.
చాలా సార్లు ఉండలేననే అనిపిస్తుంది.
కానీ ఏం చేసేది, తెలుసు తప్పదని.

ఈ క్షణం నువ్వు కావాలనిపిస్తుంది.
నీ కౌగిలి లో, నీ ముద్దులలో నన్ను నేను మర్చిపొవాలని ఉంది.
చెప్పడానికి వినడానికీ కూడా ఎమీ లేనితనం.
మనసు ఆకలి తీర్చే మౌనం, స్పర్శ ... అన్నీ కావాలని ఉంది.

ఎందుకు గడపలేను నీతో?
ఎందుకు మనం ఇలాంటి పరిస్థితులలో తారసపడాలి?
అసలు మనం ఎందుకు కలవాలి?

Monday, December 20, 2010

విరహం

విరహం .. ఎలా ఉంటుందో తెలుసా నీకు?

మొన్న తెల్లవారుఝామున చలిలొ గడిపాను,ముఖ్యంగా శీతాకాలం.
మేను వెచ్చటి చలిమంట కొసం ఆరాటపడింది,వెన్ను లో మొదలైన  వణుకు సాక్షిగా.
ఎంత అంటే, వెచ్చదనం వైపు ఒక్కొక్క అడుగు వేస్తుంటే, ప్రాణం కొంచెం కొంచెం గా తిరిగి వచ్చింది.

Needing you that badly is what missing you means to me.
Miss you a lot. Your touch, your feel.
You sunk so deep into my skin that it is no longer just me.

ఎక్కడున్నావు? ఏం చేస్తే నీ దగ్గరకు చేరతాను?

గర్వాన్ని వదులుకోవాలా?
నిన్ను ప్రేమించిన క్షణం నేననే అహం పొయింది.
సంపదా ... నా ఆస్తి నీ ప్రేమ.
అందమా ... అది నీ కళ్ళలో కాని కనిపించదు.

ఆలొచిస్తే ఇవ్వడానికి ఏమీ లేదు నా వద్ద.
ఎంత పేదదాన్నొ కదా!
ప్రేమించిన నీకు బహుమానమే లేదు నా దగ్గర.

మరేంచేసి నిన్ను చేరగలను?

నమ్మని దేవుని చుట్టూ తిరగమంటావా?
నమ్మిన ప్రేమను వేడుకోనా?
కన్నీళ్ళు కరిగిస్తాయా దూరాన్ని?

ఎలా? ఎలా? ఎలా?

నీ అధరాల స్పర్శ కొసం పగలు రాత్రి ఎదురుచూస్తుంది నా చెక్కిలి.
నీ చేతుల పట్టు కోసం విలవిలలాడుతుంది నా నడుము.
నీ వద్దకు పరుగున రావడానికి సిద్ధంగా ఉన్నాయి నా పాదాలు.
నిన్ను చూసి కాని మూతపడనంటున్నయి, నిద్రకైనా సరే, కళ్ళు.

కాళిదాసు అన్నాడట "మాటకు అర్ధం లా" అని శివపార్వతుల మనువును.
విడవలేని కాదు, విడివడలేని అనుబంధం.
అంత అదృష్టం నాకె ఉంటే!!!
ఒక్క రోజు చాలదూ, జీవితం సార్దకం కావడానికి!
ఒకా రాత్రి సరిపొదూ, పది జన్మలకి!!

ఎక్కడున్నవు??
పదునాలుగు భువనాల రాజుల సైన్యాన్ని పిలిపించి వెతికించనా?
సమస్త మాయలతో ప్రపంచాన్ని జల్లెడ పట్టించనా?
ఎలా వెతకను?

ఏమి చేస్తున్నవు?

ఎక్కడున్నవు?
నీలాకాశపు అంచుల్లోని మబ్బుల చాటునా?
తెల్లవారుఝామున భూమి కౌగిలి లోని మంచు తెరలోనా?
వెన్నెల తెల్లదనంలోనా?
సన్నజాజుల పరిమళంలోనా?

ఎక్కడ?

నిశీధిలోనా?
ప్రచండమైన వేసవి వీచికలోనా?
ఏటి పాయల గలగలలోనా?
సముద్రాల ఘోషలోనా?

ఎందులో?
నవగ్రహాల చలనంలోనా?
కోటి జీవరాశుల ప్రాణంలోనా?
సప్తవర్ణాల సొగసులోనా?
పంచ భూతాల ఉనికిలోనా?

ఎక్కడున్నావు నువ్వు?
వినిపిస్తుందా నీకు నా పిలుపు? ఎలా తెలుస్తుంది నాకది?

ఆలోచిస్తూ ఉంటాను,
కత్తి పదునువా నువ్వు, ఈ దూరం తో హృదయాన్ని కోస్తున్నావని.
లోహపు కరకుదనానివా .. నా కన్నీళ్ళకు కరగవే అని.
కాని కాదేమో ..
అంత కఠినమే అయితే నీ మనసు, అంత ప్రేమ ఎలా కురిపిస్తావు?

ఇక్కడే త్యాగరాజు గుర్తొస్తాడు :
"ఖగరాజు నీ ఆనతి విని వేగచనలేదో
గగనానికీ ఇలకూ బహుదూరంబనినాడో"
లేకపొతే నువ్వెందుకు రావూ ....
అని అంతున్న భక్తుని లానే ఉంది నా పరిస్థితి కూదా.

కాని .. ఎంత సర్దిచెప్పినా కనురెప్పలు జారతాయా నిద్ర వడిలోనికి ....
నీ రాక కోసం వేచిచూడకుండా !!

Thursday, December 16, 2010

నీ ముద్దు!!


నిన్నే చదివాను, "ప్రపంచానికి నువ్వు ఒక మనిషివే కావచ్చు, కాని ఒక మనిషికి నువ్వే ప్రపంచానివి" అని. ఆలొచిస్తూ ఉండిపొయాను. ఇంత కాంప్లెక్సిటీ లేకపోతే, జీవితం తో పాటు మనమూ పరిగెత్తాల్సిన అవసరమే లేకపోతే, నువ్వు తప్ప ఇంకే బరువు, భాధ్యత, కమిట్మెంట్స్ ... ఇవేమీ లేకపోతే ఎలా ఉండేదో అని.

అప్పటికీ ఎంత ప్రయత్నించినా నీకు దూరంగా వెళ్ళలేను.
అర్ధరాత్రి కిటికీ సందుల్లోనుండి వెన్నెల పలకరిస్తుంటే నువ్వు కావాలనిపిస్తుంది.
ఇంటి ముందు వర్షం నీరు నిన్ను గుర్తుకుతెస్తుంది.
సాయంత్రం గాలి నీ మాటై పలకరిస్తుంది.
ఇంతకీ నువ్వే నా ప్రపంచమా? తెలీదు.
కానీ నువ్వు లేకపొతే ఇది నా ప్రపంచం అయ్యేది కాదు. అది మాత్రం కచ్చితంగా చెప్పగలను.

చిన్ని నవ్వు.
కళ్ళ నుండి మొదలై పెదవి చివర తేలే నవ్వు.
అంతు లేని సంతృప్తి, ఆ కళ్ళు చూస్తే నాకు.
గుండెల నిండా గాలి పీల్చినంత నిండుగా .. సంపూర్ణంగా ఉంటుంది నీ కౌగిలింత.
నీలాకాశపు తీరాల్లోనో, ప్రపంచపు ఆవలి గ్రహాల్లోనో ఉంటుందేమో స్వర్గం అనుకునేదాన్ని.
నువ్వు నన్ను చేతుల్లోకి తీసుకున్నాకే తెలిసింది, అంత దూరం వెతకడం అనవసరమని.
నేను నీలో కలిసిపోయినట్టే ఉంటుంది, నీ పెదవుల తడి నన్ను అంటిన క్షణం.
జీవాన్ని కలిపేసినట్టు ఉంటుంది నీతో .. నన్ను ముద్దు పెట్టుకున్న నీ వైనం.

మొదటిసారి నీ ముద్దు ... తుఫానువనుకున్నను.
అంత ఆత్రం, ఆవేశం, పిచ్చి, నరాలు తెగిపొతాయేమో అనేంత ఉద్విగ్నత .... కొట్టుకుపొయాను నీ ప్రవాహంలో.
అంత దగ్గరితనం, అంత  తీవ్రత ... నా సమస్తాన్ని ఒక్క క్షణం లో కుదిపేసావు.
తలుచుకుంటే అనిపిస్తుంది, ఒక్క ముద్దు తో ఎన్ని ప్రకంపనాలు సృష్టించావు అని.

అందుకే అర్ధం కాదు నాకు నీ తలపు దేనిని పొలివుంటుందో అని ...
సాయంత్రపు చల్లగాలినా, సముద్రంలోని బడబాగ్నినా అని నాలొ నేనే వాదులాడుకుంటాను.
ఎముకలు విరిగే కౌగిలి నీదే, మళ్ళీ చెప్పాను కదా, పసిపాపను హత్తుకునే మెత్తదనం కూడా నీ చేతులదే.

అందుకే సాష్టాంగ నమస్కారం చేస్తాను ఆ ప్రేమకి.
నిన్ను దగ్గర చెసిన గుండె చప్పుళ్ళకి.
నాకీ అనుభవాన్నిచ్చిన నీ పెదవులకి.
నన్ను పరిపూర్ణం చేసిన నీ కౌగిలికి.
మన ఇద్దరిని కలిపిన సమయానికి.

... నాకు ప్రాణాన్నిచ్చిన విధాతకి.

పొందగలనా!

చలికాలం మంచు తెచ్చిన బద్ధకం, ఇంకా మబ్బుల చాటునే దోబూచులాడుతున్నడు సూర్యుడు.
నువ్వు గుర్తువచ్చావు నాకు, మంచం పైన రగ్గు చాటున వెచ్చని కౌగిలిలోనుండి రానని బద్దకంగా నన్ను చుట్టేస్తున్నట్టు!!

ఆందమైన ఊహ కదూ!!
ఆంతులేని విరహన్ని అనుభవించిన జంట సంగమానికి నిశ్శబ్ద సాక్ష్యంగా వారితో పాటు తనూ అలసిపొయిన పక్క, తమవంతు సాయం చేద్దామని వచ్చి నలిగిన మల్లెపూలు,
ఎందుకసలు తనివి తీరదు నాకు అనుకుంటూ నా గుండెల్ల్లొ తల దాచుకుని,
నా సొంతం కదా నువ్వు అంటున్న నీ దగ్గరతనం,
ఎంత సంపదకైన, ఏ వరానికైనా సరే ఈ క్షణాన్ని వదులుకొగలనా,
ఎన్ని జన్మలైనా సరే ఈ రాత్రి కొసం ఆగలేనా,
ఏది ఏమైనా సరే నిన్ను ప్రేమించకుండా ఉండగలనా .. అనుకుంటున్న నా మనసు.

అంతకంటే ఇంకేం కావాలి నాకు !!!

నీ చేతుల్లో నిద్ర లేచిన క్షణం నా కళ్ళ అంచున జారే చిన్న చుక్క
.. భాష్యం చెప్పలేని ... భావానికి అందని
ఒక అద్భుతమైన అనుభవాన్ని నిర్వచించే ఒక కన్నీటి బొట్టు.

ఆ క్షణం కోసం ఏదైనా ఫర్వాలేదనిపిస్తుంది.

నేను,  నా గర్వం,  తనువు,  మనసు,  అందం,  ఆలొచన  ..  నా సమస్త ప్రపంచం;
సప్త సముద్రాలు,  ఆకాసం,  భూమి,  గాలి,  నిప్పు,  గ్రహాలు,  లొకాలు,  నక్షత్రాలు,  దేవుళ్ళు;
ఆఖరికి వెన్నెల, మల్లెపూలు కూడా ...
ఏవైనా సరే తూగగలవా!

ఇవన్ని వదులుకునైనా సరే ... పొందగలనా!

అంకితం


నువ్వు!!!

అద్భుతానివో ... అపురూపమైన బహుమతివో ...
ప్రేమవో ...
నా ఆరాధనకు రూపానివో ...

అణువణువునూ తన్మయత్వంతో నింపిన ప్రణయమూర్తివో ...
అంతులేని అలజడిని రేపిన చెలికాడివో ...

వరానివో ... అదృష్ఠానివో ... నా పెదవి చివరి నవ్వువో ...
నా కంట కన్నీరువో ...
నా కవితకు ప్రాణానివో ... నాకు సమస్తానివో ....

బుసలు కొట్టే కొరికవో ... సేద దీర్చే ఎదవో ...
కొబ్బరి ఆకుల అంచున జాలువారే వెండి వెన్నెలంటి అందానివో ...
నడి సముద్రాన ఉవ్వెత్తున ఎగసే కెరటం వంటి ఆవేశానివో ...
మల్లె మొగ్గల వాసనంటి విరహానివో ...
మలయ సమీరమంటి చల్లదనానివో ...

నా కలల ఱేడువో ... దేవలొక పురుషుడివో ...
ఎడు జన్మల పుణ్యానివో ...
నా అస్థిత్వానికి నిర్వచనానివో ...

ఎవరైతేనేమి ?

ఆ నీకు ... ఇదే నా అక్షరాంజలి.