Monday, January 31, 2011

నీ తలపు

వరమో శాపమో తెలీదు నాకు నువ్వు!!!
కాని కిటికీ సందున చల్లని గాలికి ఊగుతున్న కొబ్బరాకు నీ తలపును తెస్తూ అడుగుతుందా ప్రశ్న.
బహుశా గాలి మోసుకొచ్చిందేమో నీ పరిమళాన్ని.
నిద్ర మత్తున హాయిగా మూసిన నీ కనురెప్పల చాటు కలనొకటి దొంగిలించి,
నా కిటికీ చాటుకు వచ్చి నిలబడింది ఈ అర్థరాత్రి ... నన్ను నీ కలలోనికి తోసేస్తూ ...

నీతొ గడిపిన ప్రతి క్షణం, నవ్విన ప్రతి నిమిషం గుర్తొచ్చి ఆ సమయం అదృష్టానికి,
ఆ రొజుల గొప్పతనానికీ ఈర్ష్యపడుతుంది హృదయం.

"ఏమైనా పాడినా గుర్తొస్తావు, మౌనంగా ఉన్నా గుర్తొస్తావు,
ఏది పొందినా గుర్తొస్తావు, ఏది పొగొట్టుకున్నా గుర్తొస్తావు ... రోజూ ..."
అంటున్నాడు ఎవరో కవి. ఒక హింది పాట అర్థం.

అందుకే టీవీ కట్టేసాను.

అయినా నీ అలోచన పోదు కదా!!!

భోరున వర్షం వస్తుంది. మనసులో బరువంతా దించేస్తున్నట్టు కురుస్తుంది.
ఎంత నిస్సహాయ పరిస్తితో చూడు నాది, నీకు నా అవసరముందని తెలుసు.
కాని రావాలనుకున్నా రాలేని పరిస్థితి. రెక్కలు కట్టుకుని వాలి,
నిన్ను దగ్గరగా హత్తుకుని నేనున్నానని చెప్పాలని ఉంది.
చెప్పలేనని తెలిసి ఈ పుస్తకం చాటున నన్ను నేను దాచుకుంటున్నాను.

ఎంత విచిత్రం జీవితం, వద్దనుకుంటూనే బంధాలన్నీ చుట్టుకుంటాయి.
వదలాలంటే వదలలేము. ఏముంది జీవితంలో ...
పడుతూ లేస్తూ ఏడుస్తూ నవ్వుతూ జరిపే ప్రయాణంలో
చివరికి మిగిలేది మనుషుల ప్రేమలు, ఙ్ఞాపకాలే కదా.

నీ గురించి ఆలోచిస్తూ జీవితాన్ని విశ్లేషిస్తున్నాను చూడు.
ఎందుకంటావు? జీవితంలో నువ్వు ముఖ్యమనా, జీవితమే నువ్వైపొయావనా!

ఇందాక చెప్పాను చూడు, మంచి పాట వస్తుందని.

कुछ गाऊ तो याद आते हो गुनगुनाऊ तो याद आते हो
कुछ पहनू तो याद आते हो कही जाऊ तो याद आते हो
कुछ खोने पे याद आते हो कुछ पाऊ तो याद आते हो

रोजाना चले ... यादों पे तेरी ... जिंदगी कॅया सफ़र
तुझसे है रोशन ... तुझसे है ज़िंदा ... ये दिल का शहर
--- " నీ ఆలొచనలలోనే నడుస్తుంది రోజూ ఈ జీవితం, నీ వలనే వెలుగు.
నీ వలనే బ్రతికుంది నా మానసనగరం."

Love you. Finally one thing :

रोजाना जिए रोजाना मरे ... तेरी यादो में हम ... रोजाना ....
---  "రోజూ బ్రతుకుతున్నాను రోజూ మరణిస్తున్నాను ... నీ ఆలొచనలలో ... రోజూ!!"
  

మోక్షం

చూడు ఎంత బెంగ తెప్పిస్తావో నువ్వు!
ఏం రాయలేక ఆగిపొయింది కలం పక్క పేజీలో.
మళ్ళీ మాట్లాడావు, చలనం వచ్చింది మనసుకు.
ఏదో ఉందోయి మంత్రమో, మాయో నీ దగ్గర.
లేకపొతే ఇలా ఎలా కట్టిపడేస్తావు నన్ను!!

ఏమిటోయి ఆ రహస్యం?
చెప్పచ్చు కదా, కొంచెం విముక్తి లభిస్తుంది నాకు.
పొనీ వద్దులే!
ఎంత బంధించి ఉన్నానని తిట్టుకున్నా,
నీకే ఆ సమ్మోహన శక్తి లేకపొతే ఎన్ని అనుభూతులను కోల్పోయేదాన్ని!!

నీ కంటి సైగకు ఉలిక్కిపడతాను.
వాటిలో నవ్వుకు సంతోషపడతాను.
చూపులో ప్రేమకు దాసొహమంటాను.
పెదవుల రుచి తెలిసి నవ్వుకుంటాను.
మధురమైన ఊహలలో తేలిపొతాను.
నలుగురిలొ నిన్ను చూస్తూ ఉండిపొతాను.
హఠాత్తుగా స్పృహలోకి వచ్చి, చుట్టూ చూసుకుంటూ కంగారుపడతాను.

నీ చేతి స్పర్శకు వణుకుతాను.
వేలికొనలకు నర్తిస్తాను.
నీ పరిమళానికి మత్తెక్కిపోతాను.
గొంతు వింటూ నన్ను నేను మర్చిపొతాను.
మాట లోని మార్దవానికి కరిగిపొతాను.

ఒక్కటీ కనిపించదు, నీలో నన్ను ఆకర్షించని విషయం.

Adoration, admiration, love, respect, madness ...
what not !!! ఏం కాదు నువ్వు నాకు?

ఎవరిచ్చారీ చనువు అని కోప్పడతాను. కాని ఆ చనువే నువ్వు తీస్కొకుంటే ... అమ్మో అనిపిస్తుంది.

ఎంత అందం నీ ప్రేమ!!
ఆకాశమంత విశాలం. అంత భరొసా.
సముద్రమంత లోతు. అంత passion.
శిఖరమంత ఎత్తు. అంత strength.
ఎండలాంటి తీక్షణం.
నీ ఆరాధన వీణతీగలంటి మధురం.
నీ సాంగత్యం అదృస్టం. నీ నవ్వు వరం.
స్పర్శ వసంతం. ఎడబాటు గ్రీష్మం.
నీ కౌగిలి స్వర్గం. నీతొ సమయం బంగారం.

నీతో జీవితం .... మోక్షం.